పూతలపట్టు ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం.. సూసైడ్ సెల్ఫీ వీడియోతో జగన్‌కు రిక్వెస్ట్

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా జగన్‌కు షాకిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కన్‌ఫర్మ్ కాకపోవడంతో.. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన లోటస్‌పాండ్‌లో జగన్‌ను కలిసే ప్రయత్నం చేశారు. మూడు రోజులపాటు వేచి చూసినప్పటికీ.. ఆయనకు జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడు. మణికట్టు కోసుకున్న ఆయన.. సెల్ఫీ వీడియో ద్వారా జగన్‌కు సందేశమిచ్చారు.

మీరు నాకు టికెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదు. నన్ను మీ వ్యక్తిగా ఉండనిస్తే చాలని సునీల్ జగన్‌ను కోరారు. జగన్ మంచి వ్యక్తి, ఆయన దళితులను ప్రేమిస్తారు. రాష్ట్రంలో ఉన్న దళితులు జగన్‌కు ఓటేయండి. నన్ను గుర్తుపెట్టుకోండని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.

మణికట్టు కోసుకున్న సునీల్‌ను మదనపల్లెలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. జగన్ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో మార్చి 12న సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.