గన్‌మెన్ కాల్పులు, రెచ్చగొడుతున్నారు.. తిక్కారెడ్డి తేల్చుకుందాం: బాలనాగిరెడ్డి

హైలైట్స్

  • వైసీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకు డ్రామాలు
  • తిక్కారెడ్డి గన్‌మెన్‌ను బెదిరించి కాల్పులు జరిపించారు
  • గ్రామాల్లో అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టీడీపీ ప్లాన్
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు టీడీపీ నేత తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. తిక్కారెడ్డి గన్‌మెన్‌ను బెదిరించి కాల్పులు జరిపించాడని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడి.. కోడ్ అమల్లో ఉన్నా గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి అలజడి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తిక్కారెడ్డి రెచ్చగొట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఖగ్గల్ గ్రామంలో ప్రచారం చేసుకుంటున్న వైసీపీ కార్యకార్తలపై తిక్కారెడ్డి బెదిరింపులకు దిగారని ఆరోపించారు బాలనాగిరెడ్డి. తిక్కారెడ్డి తమపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ముఖ్య నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకే తిక్కారెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టీడీపీ ప్లాన్ చేసిందన్నారు.

తిక్కారెడ్డి నిజంగా గెలిచే అవకాశాలు ఉంటే ఏప్రిల్ 11న జ‌రిగే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుకోవాల‌న్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తేలిపోతుంది.. టీడీపీ నేతలు ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా సంయమనం పాటిస్తామన్నారు. రెచ్చ‌గొట్టి గొడ‌వ‌ల‌కు కాలుదువ్వి వైసీపీ నేతలు, కార్యకర్తల్ని కేసుల్లో ఇరికించేందుకే తిక్కారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.