చంద్రబాబు కట్టే రాజధాని బాహుబలి సెట్టింగులే..!

అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి పాలనవల్ల నాలుగేళ్లు ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని.. అధికారంలోకి రాగానే మీ అందరి కష్టాలు తీరుస్తానని జగన్ చెప్పారు. ఓటరు జాబితా నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. 39 లక్షల మందికి రెండు ఓట్లు ఉన్నాయి. అందుకే ఓటర్ లిస్ట్‌ను అందరూ సరి చూసుకోవాలని వైసీపీ సమరశంఖారావ సభలో జగన్ పేర్కొన్నారు. సభలో జగన్ మాట్లాడుతూ.. రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. చంద్రబాబు చెప్పని అబద్ధం లేదు.. చేయని డ్రామా లేదు. చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవద్దు. ఐదేళ్లలో 1250 మందిపై అక్రమ కేసులు పెట్టారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తివేస్తాం. అవినీతిలేని స్వచ్ఛమైన పాలన ప్రతి ఒక్కరికీ అందాలి. మూడు నెలలోపే ఎన్నికలు జరగనున్నాయి.వైసీపీని అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ అందరిపై ఉంది. చంద్రబాబు డబ్బుల మూటలు ఇళ్లకు పంపిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని ప్రజలకు చెప్పండి. అమ్మ ఒడి, అన్న చేయూత కార్యక్రమాలు తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.3వేలకు పెంచుతాం. చేయూత అనే పథకం ద్వారా ప్రతీ ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు 4 దఫాలుగా 75 వేల రూపాయలు ఇస్తాం. 45ఏండ్లు నిండితే చాలు నాలుగు విడతలుగా రూ.75వేలు ఇస్తాం. పిల్లల్ని బడికి పంపిస్తే ‘అమ్మ ఒడి’ ద్వారా 15 వేల రూపాయలు ఇస్తాం. పొదుపు సంఘాల్లో అక్కాచెల్లెళ్ల రుణాలు 4 దఫాలుగా మాఫీ చేస్తాం. చంద్రబాబు ఇచ్చే చిల్లర డబ్బులకు లొంగిపోకండి. టీడీపీ అక్రమాలకు పాల్పడితే ఈసీకి ఫిర్యాదు చేయండి. చంద్రబాబు ఐదేళ్ల పాలన మూడు సినిమాలతో సమానం అని జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో డైలాగులు చెప్పారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. జాబు రావాలంటే.. బాబు రావాలని సినిమా డైలాగ్ చెప్పారు. చంద్రబాబు ప్రతీ కులాన్నీ మోసం చేశారు. మూడేళ్లలోనే పోలవరం పూర్తి చేస్తానని తప్పుడు హామీ ఇచ్చారు. చంద్రబాబు చెప్పే డైలాగ్ వింటే గుండె ఆగి చావాల్సిందే. నాలుగేళ్లు పవన్, బీజేపీతో చంద్రబాబు కాపురం చేశాడు. చంద్రబాబు కట్టే రాజధాని బాహుబలి సెట్టింగులే అని విమర్శించారు.