'రికార్డు' టైటిల్ వేటలో..

  • 24వ గ్రాండ్‌స్లామ్‌పై సెరెనా కన్ను
  • ఏడో టైటిల్‌ కోసం ఫెడరర్‌, జొకోవిచ్‌
  • భారత్‌ నుంచి ప్రజ్ఞేష్‌ ఒక్కడే
  • నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌

అమ్మగా మారినా తనలో సత్తా ఏమీ తగ్గలేదని సెరెనా విలియమ్స్‌ నిరూపించుకుంటుందా? ఈ క్రమంలో టెన్నిస్‌ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గి ‘రికార్డు’ను సమం చేయగలుగుతుందా? పురుషుల విభాగంలో ఇప్పటిదాకా ఎవరూ సాధించని రీతిలో ఏడో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను డిఫెండింగ్‌ చాంప్‌ ఫెడరర్‌, నెంబర్‌వన్‌ జొకోవిచ్‌లలో ఎవరైనా దక్కించుకోగలరా? తేలాలంటే నేటి నుంచి ఆరంభమయ్యే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ను తిలకించాల్సిందే!

మెల్‌బోర్న్‌: ఏడాది ఆరంభంలో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అంటే టెన్నిస్‌ ప్రేమికులతో పాటు ఆటగాళ్లు కూడా ఇష్టపడతారు. అందుకే దీన్ని ‘హ్యాపీ స్లామ్‌’ అని పిలుస్తుంటారు. సోమవారం నుంచి ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్‌లో మొత్తం 128 మంది ఆటగాళ్లు తలపడుతున్నారు. అయితే వీరిలో కొందరికి ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రత్యేకం కానుంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ రోజర్‌ ఫెడరర్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. గతేడాది ఫైనల్లో మారిన్‌ సిలిచ్‌ను ఓడించి ఆరో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సాధించగా గ్రాండ్‌స్లామ్స్‌ సంఖ్యను 20కి పెంచుకున్నాడు. ఈసారి టైటిల్‌ నిలబెట్టుకుంటే 37 ఏళ్ల ఫెడెక్స్‌ ఖాతాలో రికార్డు స్థాయిలో ఏడో టైటిల్‌ చేరుతుంది. ఇప్పటిదాకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను ఇన్నిసార్లు గెలిచిన ఆటగాడు లేడు. అయితే వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌తో అతడికి గట్టి పోటీనే ఎదురుకానుంది. అంతేకాదు.. జొకోవిచ్‌ కూడా ఏడో టైటిల్‌పైనే కన్నేశాడు. వీరిద్దరూ ఆసీస్‌ గ్రేట్‌ రాయ్‌ ఎమర్సన్‌తో కలిసి ఆరు టైటిళ్లతో సమానంగా ఉన్నారు. ఇక ప్రపంచ రెండో ర్యాంకర్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ తన ఫిట్‌నెస్‌ సమస్యలను వెనక్కినెట్టి రెండో టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ నుంచి అతడు ఫిట్‌నెస్‌ సమస్యతోనే వైదొలిగాడు. ఇదిలావుండగా ఈ టోర్నీ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్న ఇంగ్లండ్‌ స్టార్‌ ఆండీ మర్రేపై అందరి దృష్టీ నెలకొంది. గాయాలు వెంటాడుతుండడంతో అతడికిదే చివరి గ్రాండ్‌స్లామ్‌ కానుంది.

యువ ఆటగాళ్లతో పోటీ: వెటరన్‌ స్టార్లకు ఈసారి యువ ఆటగాళ్లు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌తో ప్రమాదమే. భవిష్యత్‌ తారగా పిలుచుకుంటున్న ఈ 21 ఏళ్ల జర్మన్‌ స్టార్‌ ఖాతాలో ఇప్పటిదాకా గ్రాండ్‌స్లామ్‌ లేదు. ఫెడరర్‌, జొకోవిచ్‌లను ఓడించగల సత్తా జ్వెరేవ్‌కు ఉందని విశ్లేషకుల అంచనా. బోర్నా కోరిక్‌ (క్రొయేషియా), కారెన్‌ కచనోవ్‌ (రష్యా) కూడా టాప్‌-3కి షాక్‌ ఇవ్వగల సమర్థులే. మరోవైపు భారత్‌ నుంచి ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ ఒక్కడే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడబోతున్నాడు.

సెరెనా సాధిస్తుందా?

రెండేళ్ల క్రితం 8 వారాల గర్భంతో ఇక్కడ ఏడోసా రి చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌ ఈసారి రికార్డు గ్రాండ్‌స్లామ్స్‌పై కన్నేసింది. మొ త్తం 24 స్లామ్స్‌తో మార్గరెట్‌ కోర్ట్‌తో సమంగా నిలవాలని ఆరాటపడుతోంది. అలాగే అమ్మగా తొలి గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకోవాలనుకుంటోంది. గతేడాది వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా ఫైనల్‌ చేరింది. మంగళవారం తొలి రౌండ్‌లో ఆడనుంది. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ కరోలిన్‌ వోజ్నియాకి, ప్రపంచ నెంబర్‌వన్‌ సిమోన హలెప్‌ అంత సులువుగా ప్రత్యర్థులకు లొంగే రకం కాదు. హలెప్‌ తొలిరౌండ్‌లో కనేపితో తలపడనుండగా నాలుగో రౌండ్‌లో సెరెనా ఎదురయ్యే చాన్స్‌ ఉంది. అలాగే షరపోవా, స్టీఫెన్స్‌, కెర్బర్‌, క్విటోవా, ఒసాక, కీస్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.