పేదల కళ్లలో వెలుగే నిజమైన సంక్రాంతి

  • సీఎం చంద్రబాబు పండగ శుభాకాంక్షలు

అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ‘పెన్షన్‌ రెట్టింపు చేసి ఇంటికి పెద్ద కొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చాను. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది. నిరుపేదల కళ్లల్లో వెలుగు చూడడమే నాకు నిజమైన సంక్రాంతి. రాష్ట్రంలో ప్రస్తుతం 50,61,906 సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు నెలకు రూ.3వేలు, రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10వేలు ఇస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారికి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన ఆయన… రాష్ట్ర భవితకు, అభివృద్ధిని కొనసాగించడానికి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం తమకు తిరిగి మద్దతు పలికి ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, దేశవిదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు మంత్రి లోకేశ్‌ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రన్న కానుకలు, పింఛన్ల రెట్టింపుతో ఈ పండగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.