Live Cricket Score, India vs Australia, 1st Test: ఆసీస్ ఆలౌట్… లీడ్ పెంచుతున్న భారత బ్యాట్స్‌మెన్.

Live Cricket Score, India vs Australia, 1st Test: ఆసీస్ ఆలౌట్... లీడ్ పెంచుతున్న భారత బ్యాట్స్‌మెన్.

కెఎల్ రాహుల్ బ్యాటింగ్ (Photo: twitter/bcci)


Chinthakindhi.Ramu | news18-telugu

Updated: December 8, 2018, 2:05 PM IST

ఆడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పట్టుసాధించే దిశగా పరుగులు సాధిస్తోంది. ఆడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 191/7 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌కు మూడో ఓవర్‌లోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. స్టార్క్‌ను అవుట్ చేసిన బుమ్రా… 27 పరుగుల ఎనిమిదో వికెట్ భాగస్వామ్యానికి తెరదింపాడు. అయితే ఆ తర్వాత వర్షం పడడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు అంపైర్లు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను షమీ దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో ట్రావిస్ హెడ్‌ను, హజెల్‌వుడ్‌ను అవుట్ చేశాడు. దీంతో 235 పరుగులకు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. 167 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ 6 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు వికెట్లు దక్కగా… ఇషాంత్, షమీలకు చెరో రెండేసి వికెట్లు దక్కాయి. లంచ్ విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కెఎల్ రాహుల్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి తోడుగా మురళీ విజయ్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తుండడంతో భారత్ ఆధిక్యం పెంచుకునే దిశగా పరుగులు పెట్టింది. మొదటి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేసిన విజయ్- రాహుల్ జోడి ఆసీస్ గడ్డ మీద మొదటిసారి ఈ మార్క్‌ను దాటింది. మొదటి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత విజయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.



First published: December 8, 2018