మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే.. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ రిపోర్ట్‌

హైద‌రాబాద్: అనుకున్నట్లే ప‌వ‌నాలు వీచాయి. కేసీఆర్ చెప్పిన‌ట్లే .. టీఆర్ఎస్ దూసుకెళ్లుతున్న‌ది. ఇవాళ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో .. కారు జోరుకు బ్రేక్ లేద‌ని తేలింది. టైమ్స్ నౌ ఎగ్జిట్ స‌ర్వే .. పింక్ పార్టీకే ప‌ట్టం క‌ట్టింది. అసెంబ్లీని ర‌ద్దు చేసి ప్ర‌జాతీర్పుకు వెళ్లిన కేసీఆర్‌కే జ‌నం జేజేలు కొట్టార‌ని ఆ ఛాన‌ల్ పేర్కొన్న‌ది. రాష్ట్రంలో గులాబీ ద‌ళం ఏక‌ప‌క్షంగా త‌న ఆధిప‌త్యాన్ని మ‌ళ్లీ చాటుకున్న‌ట్లు టైమ్స్ చెప్పింది. దుష్ట‌కూట‌మిగా మారిన ప్ర‌జాఫంట్‌ను తెలంగాణ ఓట‌ర్ తిర‌స్కరించిన‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని టైమ్స్ నౌ ఛాన‌ల్ నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది. టీఆర్ఎస్ పార్టీకి 66 సీట్లు వ‌స్తాయ‌ని టైమ్స్ నౌ అంచ‌నా వేసింది. కాంగ్రెస్ కూట‌మి 37 స్థానాలు, బీజేపీ 7, ఇత‌రులు 9 స్థానాల్లో గెలుస్తార‌ని అంచ‌నా వేశారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తి మెజారిటీని కేసీఆర్ పార్టీ సంపాదించిన‌ట్లు టైమ్స్ నౌ స్ప‌ష్టం చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజేపీ హ‌వామ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రాల్లో మ‌ళ్లీ బీజేపీ పాగా వేయ‌నున్న‌ది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇదే వెల్ల‌డించింది. 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజేపీ 46, కాంగ్రెస్ పార్టీ 35 సీట్లు రానున్నాయి. 230 స్థానాలు ఉన్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ అత్య‌ధికంగా 126 సీట్లు గెలుచుకోనున్న‌ది. కాంగ్రెస్ పార్టీకి 86 సీట్లు రానున్నాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూట‌మి మ‌ధ్య మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌ట్టి పోటీ ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఆ రాష్ట్రంలో 75 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. రాజ‌స్థాన్‌లో మాత్రం కాంగ్రెస్‌కు అనుకూల ప‌వ‌నాలు ద‌క్కాయి. ఆ పార్టీకి 105 స్థానాలు ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌సుంధ‌రా రాజే పార్టీకి కేవ‌లం 85 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని టైమ్స్ నౌ అంచ‌నా వేసింది. రాజ‌స్థాన్‌లో మొత్తం 200 స్థానాలు ఉన్నాయి.