శబరిమలకు హెలికాప్టర్లలో మహిళలు?

  • కోచి, తిరువనంతపురం నుంచి తరలింపు!
  • కేరళ పోలీసుల యోచన?

తిరువనంతపురం, నవంబరు 11: శబరిమల ఆలయానికి వెళ్లే మహిళలను అయ్యప్ప భక్తులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు రక్షణగా నిలిచినా సన్నిధానం చేరుకోలేకపోతున్నారు!దీంతో మహిళలను కోచి, తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లలో శబరిమలకు తరలిస్తే ఎలా ఉంటుందని కేరళ పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ నెల 17 నుంచి మండలం పూజలకు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుండడంతో పోలీసులు ఈ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఆలయంలోకి అన్నివయసుల మహిళలనూ అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై రెండు రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఈ నెల 13న విచారణకు రానున్నాయి. వాటిపై వచ్చే తీర్పునకు అనుగుణంగా అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని కేరళ పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును సమర్థించుకుంటే మహిళలు ఆలయానికి వెళ్లేందుకు పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లను వినియోగించాలని భావిస్తే హెలిప్యాడ్‌ కోసం అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి.

అయితే హెలికాప్టర్ల వినియోగం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అత్యవసర సమయాల్లో భక్తులను తరలించేందుకు మాత్రమే హెలికాప్లర్లను వినియోగిస్తారని పేర్కొంటున్నారు. మరోవైపు 500 మంది మహిళలు అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంపై ఓ పోలీసు అధికారి స్పందిస్తూ.. ఈ సమాచారం కేరళ పోలీసు వెబ్‌సైట్‌లో ఉందని, ఎలాంటి చెల్లింపులకూ అవకాశం లేకపోవడంతో పేర్లు నమోదు చేసుకున్నవారెవరనేది ధ్రువీకరించే పరిస్థితి లేదని తెలిపారు.